మధుర స్మృతులు-3

బైక్‌పై రయ్ రయ్ మంటూ గాలిని చీల్చుకుంటూ దూసుకుపోవాలని ప్రతి కుర్రాడికి ఉంటుంది. నాకూ ఆ వయసులో ఆ కోరిక బలంగానే ఉండేది. ఇప్పుడంటే పిల్లలు నోరు తెరవకముందే తల్లిదండ్రులు బైక్‌లు కొనిచ్చేస్తున్నారు కానీ, మా రోజుల్లో అది తలకు మించిన భారం. తల్లిదండ్రులు కడుపు కట్టుకుని చదివించడమే కష్టంగా ఉన్న ఆ రోజుల్లో, ఇంట్లో బైక్ కొనమని అడిగే ధైర్యం ఎక్కడిది? కానీ, చుట్టుపక్కల వాళ్లు బండిపై వెళ్తుంటే ఆశగా చూసేవాడిని. కొనలేకపోయినా.. కనీసం నడపడం అయినా నేర్చుకోవాలన్నది నా కల. కానీ నాకు బండి నేర్చుకోవడం ఓ పెద్ద సాహసమే అయింది.
మొదటి ప్రయత్నం: స్కూటర్.. చేజారిన అవకాశం
మా ఊరు పేరు బొరివంక. ఉద్దానం ప్రాంతంలోని పల్లెటూరు. సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రికలు శ్రీకాకుళంలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి సోంపేటకు, అక్కడి నుంచి మా ఊరికి వచ్చేవి. అప్పట్లో ఆంధ్రజ్యోతి పేపర్‌ను ఆయా గ్రామాల్లోని ఏజెంట్లకు పంపిణీ చేసే మోపెడ్ ఆపరేటర్‌గా దీన బావ పనిచేసే వారు. రోజూ తెల్లవారుజామున నిద్రలేచి ఆయనతో పాటు వెళ్లేవాడిని. నా ఉద్దేశం పేపర్లు వేయడం కాదు, తిరిగి వచ్చేటప్పుడైనా బైక్ నేర్పిస్తారన్న ఆశ. వేకువజామునే సోంపేటలో వేడి వేడి టీ తాగి, పేపర్ల కట్టలు పట్టుకుని తలతంపర, మాణిక్యపురం, బల్లిపుట్టుగ, జగతి, కవిటి మీదుగా రాజపురం వరకు సాగేది మా ప్రయాణం.
అలాంటి ఓ రోజు.. అతని స్కూటర్‌పై కొత్తూరు దాటి జగతి వైపు వస్తున్నాం. చలిగాలి వీస్తోంది.
దీనబంధు: ‘ఓయ్! రోజూ ఇలా నా వెనుకాలే కూర్చుంటే ఏం లాభం? కాస్త డ్రైవింగ్ నేర్చుకో. ఇదిగో ఈ స్కూటర్ పట్టు!’ అంటూ హఠాత్తుగా బండి ఆపారు.
నేను(కంగారుగా): ‘బావా.. నాకు రాదు కదా.. పడిపోతానేమో! నా వల్ల కాదు.’
దీనబంధు : ‘ఏం పర్లేదు పట్టు. రోడ్డు కొంచెం డౌన్‌గా ఉంది.. కొంతదూరం దానంతట అదే వెళ్తుంది. నీకు బ్యాలెన్స్ వస్తుంది.’
నాలో భయం ఉన్నా, బండి నడపాలన్న ఆశతో ధైర్యం చేసి స్కూటర్ పట్టుకున్నా. బండి ఫస్ట్ గేర్‌లోనే ఉంది. నేను క్లచ్ పట్టుకుని ఆత్రంగా ఎక్సలేటర్‌ను పైకి తిప్పాను. రోడ్డు డౌన్ కావడంతో బండి నెమ్మదిగా వెళ్తోంది కానీ, నా చేతులు మాత్రం వణుకుతున్నాయి. కొంత దూరం వెళ్లిన స్కూటర్ ఆగిపోయింది.
దీనబంధు(చిరాకుగా): ‘ఓయ్! కనీసం ఎక్సలేటర్ కూడా సరిగ్గా నులపలేవు.. నువ్వేం బండి నేరుస్తావులే..! దిగు కిందకి..’
అలా నా మొదటి డ్రైవింగ్ క్లాస్ అక్కడితోనే ఫెయిల్ అయింది. కొన్నాళ్ల పాటు బండి వైపు చూసే సాహసం చేయలేదు.
( ఇదీ చదవండి ‘నైట్ స్టడీస్’ మధుర స్మృతులు)
రెండో ప్రయత్నం: బెంబేలెత్తించిన యమహా..
కొన్ని రోజులు గడిచాయి. మా ఊరిలో వెటర్నరీ అసిస్టెంట్ పురుషోత్తం గారి వద్ద అప్పట్లో 'యమహా ఆర్ఎక్స్ 100' బైక్ ఉండేది. యమహా ఆర్ఎక్స్ 100 ఇప్పటికీ అదో క్రేజ్. ఆయన చిట్‌ఫండ్ కంపెనీలో పని చేసే దుద్ది మోహన్ గారు ఆ బండిని నడిపేవాడు. ఒక రోజు మోహన్‌కు నా బైక్ పిచ్చి గురించి తెలిసి..
మోహన్: ‘ఏంట్రా.. బండి నేర్చుకుంటావా? నేను నేర్పిస్తా రా! ఈ యమహా ఎక్కు.’
నా ఆనందానికి అవధులు లేవు. బొరివంక దాటి బెజ్జిపుట్టుగ వెళ్లే ముందు మోహన్ నాకు బండి ఇచ్చారు. బైక్ ఎలా స్టార్ట్ చేయాలి, గేర్ ఎలా వేయాలి అని కొన్ని సూచనలు చేశారు. నేను ఎంతో ఉత్సాహంగా యమహా ఎక్కాను. ఫస్ట్ గేర్ వేశాను.. కానీ ఆ కంగారులో ఎక్సలేటర్ ఒక్కసారిగా గట్టిగా లాగేసి, క్లచ్‌ను ఠక్కున వదిలేశాను.
అంతే! బండి ఒక్కసారిగా రేసుగుర్రంలా గాల్లోకి లేచి బోల్తా కొట్టింది. నేను ఎగిరిపోయి రోడ్డు పక్కన ఉన్న పెంట(పేడ) కుప్పపై పడ్డాను. నాపైన మోహన్, మా ఇద్దరిపైన యమహా బండి.. వేడిగా ఉన్న సైలెన్సర్ అతని కాలి మీద పడటంతో చురుక్కుమంది. చిన్నపాటి గాయం కూడా అయింది. అదృష్టవశాత్తూ ఇద్దరికీ పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది కానీ, ఆ రోజు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాం. ఈ దెబ్బతో నాకు బండి నేర్పించడానికి ఎవరూ సాహసించలేదు.
(ఇదీ చదవండి మా ఊరి ‘కిటికీ’ థియేటర్)
ముచ్చటగా మూడోసారి: తాళం లేకపోయినా స్టార్ట్ అయ్యే బండి
ఇంటర్ పూర్తయ్యాక గెస్ట్ స్వచ్ఛంద సంస్థ నడిపే బాల కార్మిక పాఠశాలలో బోధకుడిగా చేరాను. ఆ సంస్థ అధ్యక్షుడు బల్లెడ శంకరరావు గారి వద్ద ఓ సుజుకీ ఫియిరో బైక్ ఉండేది. ఆయన శ్రీకాకుళం పని మీద వెళ్లినప్పుడు ఆ బైక్‌ను స్కూల్ వద్దే పార్క్ చేసి వెళ్లేవారు. ఆ బండికి ఉన్న ఒకే ఒక మ్యాజిక్ ఏంటంటే.. ఏ తాళం పెట్టినా స్టార్ట్ అయిపోయేది! ఆయన లేని సమయంలో నాతో పని చేసే పుల్లట సంతోష్ దాన్ని బయటకు తీసేవారు.
సంతోష్: రా వోయ్.. ఈ రోజు నీకు ఎలాగైనా బండి నేర్పించే తీరుతాను.
నేను: వద్దు లేవోయ్.. యమహాతో జరిగిన ప్రమాదం ఇంకా కళ్లముందే ఉంది.
సంతోష్: భయపడకు, నేను వెనకాలే ఉన్నాను కదా.
అప్పటికే బండిపై కొంత అవగాహన ఉండటం, సంతోష్ ఇచ్చిన ధైర్యంతో నెమ్మదిగా ఫియిరో నడపడం మొదలుపెట్టాను. ఒకటి, రెండు రోజుల్లోనే నాలో భయం పోయి బ్యాలెన్స్ వచ్చింది. అలా నా బైక్ కల నెరవేరింది. ఆ తర్వాత బాక్సర్, క్రాక్స్, పల్సర్.. ఇలా ఎన్నో బైక్‌లు నడిపాను.
మెగాస్టార్ చిరంజీవితో మరుపురాని జ్ఞాపకం!
బైక్ నేర్చుకున్నాక నా జీవితంలో అద్భుతమైన ఘట్టం ఒకటి జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత మా ఊరు పక్కనే ఉన్న ఇద్దివానిపాలెం పర్యటనకు వచ్చారు. అప్పుడు దీనబంధు గారి వద్ద పల్సర్ బైక్ ఉండేది. ఆయన ప్రెస్ రిపోర్టర్ కావడంతో మీడియా వెహికల్ ఎక్కారు, నాకు తన బైక్ ఇచ్చారు.
నేను అందరికంటే ముందుగా ఊరి పొలిమేరలో చిరంజీవి గారి కోసం వెయిట్ చేస్తున్నాను. కరెక్ట్‌గా నా దగ్గరే యాదృచ్ఛికంగా ఆయన బస్సు ఆగింది. గ్రామంలోకి వెళ్లాలంటే కాస్త దూరం నడవాలి. అప్పుడు కురసాల కన్నబాబు గారు నా దగ్గరకు వచ్చి.. మీ బైక్ ఇవ్వండి చిరంజీవి గారు డ్రైవ్ చేస్తారు అనగానే నాకు నోట మాటలు రాలేదు!
చిరంజీవి గారు డ్రైవ్ చేస్తుంటే వెనుక నేను కూర్చుంటానని ఊహించుకున్నాను. కానీ ఆయన బండి ఎక్కడం, సెక్యూరిటీ నన్ను పక్కకు తోసేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆయన నా బండిపై వెళ్తుంటే.. ఒకపక్క వెనుక కూర్చోలేదనే బాధ, మరోపక్క ఆ బండిలో పెట్రోల్ తక్కువగా ఉందన్న టెన్షన్! ఎక్కడ బండి ఆగిపోతుందో అని భయం భయంగానే చూశాను. కానీ మెగాస్టార్ నా బైక్ నడిపారన్న ఆనందం ముందు ఆ టెన్షన్ చిన్నదైపోయింది. ఆ తర్వాత పల్సర్ బైక్ మా ఏరియాలో 'వరల్డ్ ఫేమస్' అయిపోయింది.
(ఇదీ చదవండి నేలతల్లికి రైతన్న కృతజ్ఞత)
సొంత బండి.. గుణపాఠం.
| 2017లో నా మొదటి బైక్ హోండా యూనికార్న్ |
నాకంటూ ఓ సొంత బండి ఉండాలన్న కల మాత్రం 2017లో నెరవేరింది. నా పెళ్లికి మా అత్తవారు గిఫ్ట్‌గా బండి ఇచ్చారు. అప్పుడు విశాఖపట్నం వెళ్లి, నాకు స్కూటర్‌పై తొలిసారి ఓనమాలు నేర్పించిన అదే దీనబంధు బావతో కలిసి హోండా యూనికార్న్ కొన్నాను. ఆ బండి ఇప్పటికీ నాతోనే ఉంది.
అయితే..
ఒక రోజు నేను బైక్‌పై వెళ్తున్నాను. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయాను. అదే సమయంలో ఎదురుగా మరో బైక్‌పై ఒకతను వస్తున్నాడు. క్షణాల వ్యవధిలో ఇద్దరం ఢీకొనాలి. అయితే ఇద్దరం బ్రేకులు వేసి ఆగాం. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను నా దగ్గరకు వచ్చి, కోపగించుకోకుండా చాలా ప్రశాంతంగా నా భుజం తట్టి ఇలా అన్నాడు..
‘తమ్ముడూ.. నేను మా ఇంటికి వెళ్లాలి, నువ్వు మీ ఇంటికి వెళ్లాలి. మన కోసం మనవాళ్లు ఇంట్లో ఎదురుచూస్తుంటారు. ప్రాణాల మీదకు తెచ్చే ఈ స్పీడ్ మనకు అవసరమా చెప్పు?’
ఆ మాటలు నా మనసుకు బలంగా తాకాయి. అతను వెళ్లిపోయాడు కానీ, ఆ మాటలు మాత్రం నాతోనే ఉండిపోయాయి. అప్పటి నుంచి బైక్ స్టార్ట్ చేసిన ప్రతిసారీ అతని మాటలే నాకు గుర్తొస్తాయి. ఆటోమేటిక్‌గా నా చేతులు ఎక్సలేటర్‌ను అదుపులో పెడతాయి.
బైక్ మీద వేగంగా వెళ్లడం గొప్ప కాదు, సురక్షితంగా గమ్యం చేరడమే అసలైన గొప్ప.
