![]() |
| (ఇదే మా ట్యూషన్ సెంటర్) |
ఇప్పుడు ఆ జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తోంది. ఆ రోజుల్లో మనం పడ్డ కష్టం, చేసిన అల్లరి.. అంతా ఇంతా కాదు.
‘లెగండిరా.. నాలుగైంది’ - ఆ కోపం వెనుక దాగున్న తపన
పదో తరగతి అంటే అప్పట్లో పెద్ద యుద్ధమే. ఆ యుద్ధంలో మనల్ని గెలిపించడానికి ఉపాధ్యాయులు పడ్డ తపన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అప్పటి పావని విద్యాలయం ప్రిన్సిపాల్, తాజా మాజీ సర్పంచ్ బెందాళం శ్రీరాంప్రసాద్ గారు.. మనందరికీ చినబాబు. ఆయన పర్యవేక్షణ ఎంత కఠినంగా ఉండేదో, మన మీద ఆయనకు అంతకంటే ఎక్కువ ప్రేమ ఉండేది. మా నాన్న పురుషోత్తం గారికి చినబాబుతో ఉన్న చనువు వల్ల, జిల్లా పరిషత్ స్కూల్లో చదివే నాకు కూడా ఆ కాన్వెంట్ పిల్లలతో పాటు నైట్ స్టడీస్‌లో చదువుకునే అవకాశం లభించింది.
ఒకరోజు రాత్రి 11 గంటల వరకు కళ్లు కాయలు కాసేలా చదివి, పుస్తకాలు పక్కనపెట్టి గాఢ నిద్రలోకి జారుకున్నాం. కాసేపటికే.. ‘లెగండిరా.. ఉదయం నాలుగైంది చదవండిరా..’ అంటూ చినబాబు గట్టి కేకలు వేశారు. చలికి దుప్పట్లు ముసుగుతన్ని బద్ధకంగా లేచి కూర్చున్నాం. నిద్రమత్తులో ముందున్న పుస్తకంలో ఏం చదువుతున్నామో కూడా అర్థం కాలేదు. కాసేపటికి ఆయనే మళ్లీ వచ్చి.. ‘సారీ రా.. అర్ధరాత్రి ఒంటి గంట అయింది, మంచి నిద్రలో ఉంటే లేపేశాను.. పడుకోండి’ అనగానే మన ప్రాణం లేచి వచ్చింది. మనకు మంచి మార్కులు రావాలని ఆయన పడిన ఆరాటానికి ఆ సంఘటన ఒక చిన్న ఉదాహరణ.
వరండా నిద్ర.. అర్ధరాత్రి ఆకారం!
చినబాబు గారి ఇంటి దగ్గరున్న పోస్టాఫీసు వరండానే మనకు క్లాస్ రూమ్, బెడ్ రూమ్ అంతా. 15 ఏళ్ల వయసు.. ఆరుబయట చలిలో ఒంటరిగా పడుకోవాలంటే లోపల ఎక్కడో చిన్న భయం. కానీ, ఏ డౌట్ వచ్చినా టీచర్లు అందుబాటులో ఉంటారనే ధైర్యంతో రోజూ అక్కడే నిద్ర. ఒకరోజు రాత్రి చదువు ముగించుకుని నేను, రమేష్, నాగేంద్ర, ఇతర స్నేహితులం పడుకున్నాం. అర్ధరాత్రి సడన్‌గా మెలకువ వచ్చి బయటకు చూస్తే.. దూరంగా తెల్లని దుస్తుల్లో ఒక ఆకారం మెల్లగా నడిచి వస్తోంది. అంతే.. గుండె జారిపోయినంత పనైంది. తీరా దగ్గరయ్యాక చూస్తే ఆమె మన ట్యూషన్ వీధిలోనే ఉండే వృద్ధురాలు. రోజూ ఉదయం చూసే ఆ బామ్మ, ఆ అర్ధరాత్రి వేళ అలా కనిపించేసరికి భయంతో వణికిపోయాం.
నిద్రమత్తులో అల్లరి.. మరువలేని నవ్వులు
చదువుల ఒత్తిడిలోనూ మన అల్లరి పనులు తక్కువేం కాదు. మన బ్యాచ్‌లో నిద్రను ఆపుకోలేని ఆ మిత్రుడు గుర్తున్నాడా? చేతిలో పుస్తకం ఉంటుంది.. దూరం నుంచి చూస్తే భలే చదివేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ దగ్గరకెళ్లి చూస్తే మటం వేసి, కాళ్లపై అట్టపెట్టి కూర్చునే కునుకేస్తుండేవాడు. ఒక రోజు వాడి నిద్రను క్యాచ్ చేసిన మనలో ఒకడు.. వాడు గమనించకుండా మెల్లగా చేతిలో ఉన్న పుస్తకం తీసేసి ఆ అట్టమీద చెప్పు పెట్టాడు. పాపం అతను ఆ నిద్రమత్తులో చెప్పు చూసుకుంటూనే నోటితో ఏదో గొణుక్కుంటున్నాడు. సరిగ్గా అదే సమయానికి చినబాబు రావడం, గట్టిగా కేక వేయడం.. ఉలిక్కిపడిన మనోడు ఆ చెప్పు పట్టుకునే చదివేస్తున్నట్లు కవర్ చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ సంఘటనతో అప్పట్లో చిన్నపాటి దెబ్బలు పడినా.. ఈరోజు తలచుకుంటే మాత్రం మనందరి పెదవులపై నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. ఆ వయసులో ఆ చిలిపి అల్లరి ఎంత మధురమైనదో కదా!
![]() |
| (ఊహా చిత్రం) |
ఆనాటి కష్టమే.. నేటి మన పునాది
ఇలాంటి భయాలు, నవ్వులు, వరండా నిద్రల మధ్య చినబాబు పర్యవేక్షణ.. స్కూల్ టీచర్ల మార్గదర్శకత్వంలో ఆ ఏడాది మనం అద్భుతమైన ఫలితాలు సాధించాం.
ఆ రోజు ఆ వరండా గడపల్లో చదువుకున్న రమేష్, నాగేంద్ర బోధన రంగంలో ఉన్నారు. కొందరు ఆర్మీకి వెళ్లారు. మరికొందరు ఇతర ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. నేను జర్నలిజం వైపు అడుగులేశాను. ఇవాళ మనం ఏ వృత్తుల్లో ఉన్నా.. జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా.. ట్యూషన్ సెంటర్ జ్ఞాపకాలు మరిచిపోలేం.
మిత్రులారా.. ఆ వీధికి వెళ్లినప్పుడు నాకు కలిగిన ఈ అనుభూతిని మీతో పంచుకోవాలనిపించింది. ఆ రోజుల్లో మనం పడ్డ కష్టం, టీచర్లు మనకోసం పడ్డ తపన.. ఎప్పటికీ పదిలమే కదూ!



ఆ రోజులు.. మళ్లీ రావు
రిప్లయితొలగించండి