- ఉద్దానంలో నాటక కళకు జీవం పోస్తున్న ఉపాధ్యాయుడు
- బొరివంక వేదికగా కళింగసీమ నాటకోత్సవాలు
![]() |
| వ్యసనం నాటికలో సన్నివేశాన్ని రక్తికట్టిస్తున్న లక్ష్మణరావు మాస్టారు(మధ్యలో) |
(గొరకల పూర్ణచందర్, 9705094441)
తెర లేచింది... వెలుగులు విరజిమ్మాయి! ఒక ఉపాధ్యాయుడు రంగులద్దుకుని రంగస్థలంపై అడుగుపెట్టాడు. నటన అంటే ఏంటో తెలియని ఆ వ్యక్తి, తన తొలి అడుగులోనే ప్రేక్షకుల కరతాళ ధ్వనులను సొంతం చేసుకున్నాడు. అనుకోకుండా మొదలైన ఆ నాటక ప్రయాణం ఇప్పుడు ఒక కళా పరిషత్‌కు ప్రాణం పోసే స్థాయికి చేరింది. ఆయనే బల్లెడ లక్ష్మణమూర్తి. ఉద్దాన ప్రాంతంలో ఈ పేరు సుపరిచితమే.. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రవృత్తి రీత్యా రంగస్థల కళాకారుడు.. ఇప్పుడు అంతరించిపోతున్న నాటక కళకు ‘కళింగసీమ కళా పీఠం’ ద్వారా జీవం పోస్తున్న పరిషత్ నిర్వాహకుడు.
కళల పురిటిగడ్డ.. బొరివంక
ఈ కథంతా అర్థం కావాలంటే ముందుగా ఉద్దాన ప్రాంతంలోని బొరివంక గ్రామం గురించి తెలుసుకోవాలి. ఒక వైపు విశాలమైన సముద్ర తీరం, పచ్చని కొబ్బరి, జీడిమామిడి తోటల మధ్య విభిన్న సంస్కృతులకు నిలయమైన అందమైన పల్లెటూరు ఇది. పూర్వీకుల నుంచి కళలను ఆదరిస్తూ, ఎందరో కళాకారులకు పుట్టినిల్లుగా మారింది. ఇక్కడ తెలుగు, ఒడియా నాటక సమాజాల ద్వారా నరసింహ స్వామి నాటకం వేస్తూ కళాకారులు విశేష ప్రజాదరణ పొందుతున్నారు. ఇక్కడి శర్వాణి గిరిజన సాంస్కృతిక కళాపీఠం ద్వారా ఎంతోమంది కళాకారులు గొప్ప అవకాశాలు దక్కించుకున్నారు. ఈ మట్టిలో పుట్టిన ఎందరో కళాకారులు నంది అవార్డులు, సినీ అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతో పాటు వండర్ బుక్, ఆసియన్ బుక్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకున్నారు.
![]() |
| రేలా నాటికలో ఓ సన్నివేశం |
రంగస్థలంపై ఆకస్మిక ప్రవేశం..
అటువంటి గొప్ప నేపథ్యం ఉన్న ఊరిలో లక్ష్మణమూర్తి మాస్టారి రంగస్థల ప్రవేశం 2005లో రేలా నాటికతో అనుకోకుండా జరిగింది. ప్రముఖ రంగస్థల దర్శకుడు కె.కె.ఎల్ స్వామి దర్శకత్వంలో 'రేలా' నాటికకు నటీనటుల ఎంపిక జరుగుతున్న సమయం అది. అందులో ఎస్ఐ పాత్రకు లక్ష్మణమూర్తి సరిపోతాడని దర్శకుడు భావించారు. ఎప్పుడూ స్టేజ్ ఎక్కని తాను నటించగలనా అని ఆయన తటపటాయించినా, దర్శకుడి ప్రోత్సాహంతో అడుగు ముందుకేశారు. ఆ నాటిక దాదాపు 50 ప్రాంతాల్లో ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మంతువు, క్రిమి, వ్యసనం వంటి ఎన్నో నాటకాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి తన ప్రతిభను చాటుకున్నారు.
అలుపెరగని కళా ప్రయాణం
వృత్తిపరమైన బాధ్యతలు, కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్నా, ఆయనలోని కళాకారుడు మాత్రం నిద్రపోలేదు. ఆ కళా తపనతోనే కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తుల సహకారంతో నాటక పరిషత్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో నాటక పరిషత్ నిర్వహించడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఆర్థిక వనరులు, కళాకారులకు వసతులు, ఇతర ఏర్పాట్లు.. ఇవన్నీ ఒక యజ్ఞంలాంటివి. అయినా సరే, కళ పట్ల ఉన్న మక్కువతో కళింగసీమ కళాపీఠం స్థాపించి ద్విగ్విజయంగా ముందుకు సాగుతున్నారు.
కళింగసీమ కళాపీఠం ద్వితీయ నాటకోత్సవాలు
గత ఏడాది ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు నిర్వహించిన మొదటి పరిషత్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆ ఉత్సాహంతోనే ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలతో ద్వితీయ కళాపరిషత్‌ను నిర్వహించడానికి కళింగసీమ కళాపీఠం సిద్ధమైంది. 2026 ఏప్రిల్ 3, 4, 5 తేదీలలో శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, బొరివంకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల బెందాళం వెంకటేశ్వర శర్మ స్మారక కళా వేదికపై ఈ పోటీలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
కళామతల్లి ముద్దుబిడ్డలకు జీవిత సాఫల్య పురస్కారాలు
ఈ నాటక పోటీల సందర్భంగా, ఉద్దానం ప్రాంతంలో కళలకు విశేష సేవలందించిన ఇద్దరు మహానుభావుల జ్ఞాపకార్థం జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
నాటక రంగం: ఉద్దానం ప్రాంతానికి నాటక రంగంలో ఆధునిక పోకడలను పరిచయం చేసి, ఎంతో మంది కళాకారులను తయారు చేసిన స్వర్గీయ బెందాళం ప్రకాష్ పేరున ప్రముఖ రంగస్థల నటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావుకు ఈ పురస్కారం అందించనున్నారు.
సంగీత రంగం: కళను పదిమందికి పంచాలనే ఉద్దేశంతో తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, ఉద్దానం ప్రాంతంలో స్వయంగా గ్రామాలకు వెళ్లి ఎంతోమంది శిష్యులను తయారు చేసిన స్వర్గీయ నిమ్మన పురుషోత్తం పేరున ప్రముఖ మృదంగ విద్వాన్ బొంతల కోటి కృష్ణారావుకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు.
నేటి సమాజంలో సామాజిక నాటకాల ప్రభావం
ఆధునిక యుగంలో డిజిటల్ వినోదం ఎంత పెరిగినా, ప్రత్యక్షంగా కళ్లెదుట జరిగే నాటక ప్రదర్శన చూపే ప్రభావం అనిర్వచనీయమైనది. సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు, అవినీతి, స్త్రీ సాధికారత, మానవ సంబంధాల పతనం వంటి సార్వజనీన సమస్యలను నాటకాలు అత్యంత సున్నితంగా, అదే సమయంలో బలంగా ప్రశ్నిస్తాయి. ప్రేక్షకుడిని కేవలం వినోదానికే పరిమితం చేయకుండా, ఆలోచింపజేసి వారిలో ఒక అంతర్మథనం మొదలయ్యేలా చేస్తాయి. నటీనటుల హావభావాలు, సజీవమైన సంభాషణలు నేరుగా ప్రేక్షకుడి హృదయాన్ని తాకి, సామాజిక మార్పుకు, చైతన్యానికి ఒక బలమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. అందుకే, సామాజిక నాటకం అనేది ఎప్పటికీ సజీవంగా ఉండే ఒక నిరంతర పాఠశాల.
సమాజంపై నాటకానిది చెరగని ముద్ర
నాటకం అనేది కేవలం వినోదం కాదు, అది సమాజంపై, సంస్కృతిపై తీవ్ర ప్రభావం చూపే శక్తివంతమైన సాధనం. ఉద్దానం ప్రాంతం నుంచి ఎందరో మహానుభావులు అద్భుతమైన నటనతో నాటక రంగంపై తమదైన ముద్రవేశారు. ఇప్పుడున్న పరిస్థితులలో నాటకాన్ని ఈ ప్రాంత ప్రజలకు మరింత చేరువ చేయాలనే తపనతోనే 2024లో కళింగసీమ కళాపీఠాన్ని స్థాపించాం. 2025 ఫిబ్రవరిలో మొదటి ప్రయత్నంగా నిర్వహించిన నాటక పరిషత్‌కు మీరందించిన అభిమానం, ఉత్సాహం, ఆదరణే స్ఫూర్తిగా ఈ సంవత్సరం కూడా పరిషత్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం.



