- నేటి నుంచి ఉద్దానంలో అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు
- 21 రోజుల పాటు ఆధ్యాత్మిక పండుగ
సిరులొసగే చల్లని తల్లిగా, భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఉద్యానవన రాణి 'చింతామణి అమ్మవారు'. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రఖ్యాతి గాంచిన ఆ చల్లని తల్లి పండుగకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తానెక్కడ కొలువై ఉన్నానో స్వయంగా భక్తుడికి కలలో కనిపించి మరీ ఆలయ నిర్మాణం చేయించుకున్న ఆ జగన్మాత ఉత్సవాలు బుధవారం (మే 13) నుంచి జూన్ 2వ తేదీ వరకు.. 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సుమారు తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ మహా ఉత్సవాలకు ఉద్దానం ప్రాంతం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది.
స్వయంభువుగా వెలసిన చరిత్ర
కవిటిలోని చింతామణి అమ్మవారికి సుమారు మూడు వందల ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. దశాబ్దాల క్రితం ఉద్దానం ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేది. స్థానిక రైతులు వ్యవసాయం కోసం పొదలు, తుప్పలు నరుకుతుండగా శ్రీ చింతామణి దేవి నిజరూప విగ్రహం లభ్యమైంది. తమ కష్టాలను కడతేర్చేందుకు అమ్మవారే స్వయంగా వచ్చారని భావించిన వారు. విగ్రహాన్ని ఓ మర్రిచెట్టు కింద ఉంచి భక్తిశ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు. ప్రతి ఆది మంగళవారాల్లో సంబరాలు చేయడం అప్పటినుంచి ప్రారంభమైంది.
కలలో కనిపించిన చల్లని తల్లి
ఒకనాటి మంగళవారం పూజల అనంతరం అర్చకుడు తన 'చెంబు'ను (తీర్థ పాత్రను) మర్రిచెట్టు వద్దే మరిచిపోయాడు. రాత్రి పూట దానిని తీసుకురావడానికి వెళ్లిన అతనికి, అక్కడ సాక్షాత్తు అమ్మవారు కొలువుదీరిన అద్భుత దృశ్యం కనిపించడంతో అతను ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఆ రాత్రి అమ్మవారు అతని కలలో కనిపించి, ఆ చెంబు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే తనకు గుడి కట్టాలని ఆదేశించారని స్థల పురాణం చెబుతోంది. అలా తొలుత తాటాకు గుడిసెతో మొదలైన అమ్మవారి సేవ.. దశాబ్దాల క్రితం వలస వచ్చిన కార్మికులు, అగ్నికుల క్షత్రియుల సహకారంతో పూర్తిస్థాయి ఆలయంగా రూపుదిద్దుకుంది. దేవదాయ శాఖ నిధులతో, ట్రస్ట్ బోర్డ్ నేతృత్వంలో ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ నేడు ఈ స్థాయికి చేరుకుంది.
ఒడియా భాషలో దండకం.. సామంతుల సేవలు
చింతామణి అమ్మవారి ఆరాధనలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. అడవి ప్రాంతాన్ని చదును చేసిన 'సామంతులు (జన్ని)' వంశీయులే తరతరాలుగా అమ్మవారికి అర్చకులుగా సేవలు అందిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. వీరు నేటికీ ఒడియా భాషలోనే అమ్మవారికి దండకం చదవడం, పూజలు చేయడం విశేషం. సంతానలేమితో బాధపడేవారు అమ్మవారిని దర్శించుకుంటే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. కోర్కెలు తీరిన వారు అమ్మవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఉత్సవాల ప్రధాన ఆకర్షణ.. సన్నాయి మేళం, కాళికా వేషం
సాధారణంగా ప్రతి మూడు, ఐదు, ఏడు లేదా తొమ్మిదేళ్లకు ఒకసారి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. 2017లో ఈ ఉత్సవాలు జరగ్గా.. మళ్లీ ఇప్పుడు అత్యంత వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం గోధూళి వేళ ప్రత్యేక పూజలతో ఈ పండుగ లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఉత్సవాల్లో చింతామణి అమ్మవారితో పాటు కనకదుర్గా దేవికి కూడా సంబరాలు జరుపుతారు. కవిటి ఉత్సవాలంటే అందరికీ ప్రధానంగా గుర్తొచ్చేది 'సన్నాయి మేళం, కాళికా దేవి వేషం'. సన్నాయి మేళం లయబద్ధమైన స్వరాలకు అనుగుణంగా కాళికావేషధారులు చేసే నృత్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ మేళం లేకుండా ఉత్సవాలు పరిపూర్ణం కావనే నానుడి ఇక్కడ బలంగా ఉంది.
16 గ్రామాల కలయిక.. మురిసిపోతున్న ఉద్దానం
కవిటి మేజర్ పంచాయతీ పరిధితో పాటు చుట్టుపక్కల సుమారు 16 గ్రామాల ప్రజలు ఉమ్మడిగా, ఎంతో ఐకమత్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆలయంతో పాటు కవిటి వీధులన్నీ విద్యుత్ దీపకాంతులు, తోరణాలతో శోభాయమానంగా ముస్తాబయ్యాయి. లక్షల రూపాయల వ్యయంతో సాంస్కృతిక కార్యక్రమాలు, భారీ సెట్టింగులు, రథాలను ముస్తాబు చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు సైతం ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వేసవి సెలవులు సైతం కలిసి రావడంతో ఉద్దానం అంతా పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను నిర్వాహకులు పకడ్బందీగా పూర్తి చేశారు.

