
(ఫొటో: రవి మాస్టారు గారి ఫేస్బుక్ వాల్ నుంచి)
ఆరుగాలం శ్రమించి, చెమట చిందించి పండించిన పంట, చేతికి అందివచ్చిన వేళ.. అన్నదాత ఆనందానికి అవధులు ఉండవు. ఎండనకా, వాననకా కష్టపడిన రైతు, తన కళ్ల ముందు బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ధాన్యాన్ని చూడగానే.. గడిచిన రోజుల్లో పడిన శ్రమ, వేదన అన్నీ మర్చిపోతాడు. ఆ ధాన్యపు రాశిలోనే తన సంతోషాన్ని, భవిష్యత్తును వెతుక్కుంటాడు.
పొలం గట్ల నుంచి ధాన్యం కళ్లాలకు చేరాక, ఆ ధాన్యపు రాశిని కేవలం పంటగా కాకుండా, సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి పూజించే గొప్ప సంస్కృతి మనది. అలాంటి అరుదైన, ఆనందకరమైన వేడుకే ఈ ‘కళ్ళం వారం(ధాన్య లక్ష్మి పూజ)’. ఉద్దానం ప్రాంతంలో ఈ సంప్రదాయం నేటికీ ఘనంగా జరుగుతోంది.
సంక్రాంతి అంటేనే పల్లె పండగ. ఈ పండుగ సమయంలో ఇల్లు, వాకిలి బంధుమిత్రుల రాకతో, పిల్లల కేరింతలతో ఎంత సందడిగా ఉంటుందో.. ధాన్యపు రాశులతో ఇల్లు కూడా అంతే కళకళలాడుతుంది. సిరులు ఇంటికి వచ్చిన వేళ జరిగే ఈ పండగలో ప్రతి అడుగూ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. పోలి పండగ నుంచి కొత్తగలడం దాకా.. ఈ సంబరం ఒక్కరోజుది కాదు. పంట కోతల సమయంలో పోలి పండగతో ఈ క్రతువు మొదలవుతుంది. కోసిన పంటను కళ్ళం(నూర్పిడి చేసే స్థలం)కు చేర్చి, నూర్పిడి(ఇప్పుడు చాలా మంది యంత్రాలనే వాడుతున్నారు) పూర్తయ్యాక ధాన్యాన్ని రాశిగా పోస్తారు. ఆ ధాన్యలక్ష్మిని బంతి పూలతో అలంకరించి, రాశిపై కొబ్బరికాయను ఉంచి శిఖర సమానంగా పూజిస్తారు. ముగ్గులు, దీపాలు, ధూపదీప నైవేద్యాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక పరిమళంతో నిండిపోతుంది. ఈ పూజలో ప్రధాన ఆకర్షణ కొత్త బియ్యం పాయసం. కొత్తగా వచ్చిన బియ్యం, బెల్లం కలిపి వండిన పాయసాన్ని అరటి ఆకులో ఆ తల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం రైతులు ఆ ప్రసాదాన్ని తింటారు. దీనినే స్థానికంగా కొత్తగలడం అంటారు. తాను తినడమే కాకుండా, ఎంతోమందికి కడుపు నింపే అదృష్టం ఈ రూపంలో అన్నదాతకు దక్కుతుంది.
ఈ ఫొటో చూడగానే నా చిన్ననాటి మధుర స్మృతులు మనసుని తాకాయి. నాడు రైతులు కళ్ళంలో పూజలు చేసి, అక్కడే అందరికీ పాయసం పెట్టేవారు. ఆ పాయసం కోసం పిల్లలందరం ఆశగా వేచి చూసేవాళ్లు. ధాన్యం ఇస్తే బదులుగా నెయ్యి ముద్దలు(ముడిలతో చేసే తీపి ఉండలు), అటుకులు ఇచ్చే వస్తుమార్పిడి పద్ధతి అప్పట్లో ఉండేది. పొలాల్లో రైతులు పంట తీసుకువెళ్లాక, అక్కడక్కడా రాలిపడి వదిలేసిన ధాన్యం కంకులను ఏరుకుని వాటిని పోగు చేసి, ఆ ధాన్యాన్ని ఇచ్చి నెయ్యి ముద్దలు కొనుక్కొని తినడంలో ఉన్న ఆనందం వెలకట్టలేనిది. ఆ రోజులన్నీ కళ్ల ముందు మెదలుతున్నాయి.
ఆధునికత ఎంత పెరిగినా, మూలాలను మరువని పల్లెటూరి జీవనానికి ఈ చిత్రం ఒక నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి సంప్రదాయాలు ఉద్దానం పల్లెల్లో ఇంకా బతికి ఉండటం భావితరాలకు స్ఫూర్తిదాయకం.
జై కిసాన్!
