(మధుర స్మృతులు-2)
ఉద్దానం పచ్చదనం మధ్యన మా ఊరు బొరివంక. కాలం అప్పుడప్పుడే రేడియోల నుంచి టెలివిజన్ల వైపు అడుగులు వేస్తున్న రోజులు. అప్పట్లో టీవీ అంటే ఒక అద్భుతం. ఊరంతటికీ కలిపి ఏ ముగ్గురు నలుగురి ఇళ్లలోనో ఆ ‘మాయా పెట్టె’ ఉండేది. ఆ ఇళ్లలోకి వెళ్లడం అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లోకి వెళ్లినంత గొప్ప విషయం.
ఆ కిటికీనే మాకు స్టేడియం
అవి నా స్కూల్ రోజులు. క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. కానీ మా ఇంట్లో, కనీసం మా వీధిలో ఎవరి ఇంట్లోనూ టీవీ లేదు. రోడ్డు పక్కనే ఉన్న కోమటి కృష్ణారావు గారి ఇల్లే మాకు ఏకైక ఆధారం. అప్పట్లోనే ఆయన కేబుల్ నెట్వర్క్ నడిపేవారు. వారి ఇంటి పైన పెద్ద పెద్ద డిష్లు కనిపిస్తూ అందరినీ ఆకర్షించేవి. ఆ ఇంటి తలుపులు దాటి లోపలికి వెళ్లే చనువు, అవకాశం మాకు ఉండేవి కావు. అందుకే ఆ ఇంటి గోడకు ఉన్న కిటికీనే మేం స్క్రీన్గా మార్చుకున్నాం.
మ్యాచ్ వస్తుందంటే చాలు.. నేను, నా స్నేహితుడు, ఇంకా కొంతమంది కుర్రాళ్లం ఆ కిటికీ దగ్గర వాలిపోయేవాళ్లం. ముందుగా వెళ్లిన వాళ్లకే వీఐపీ సీటు.. అదేనండీ, కిటికీ ఊచలు పట్టుకుని నిలబడే అవకాశం! కాస్త ఆలస్యంగా వెళ్లిన వాళ్లకు వెనుక నిల్చుని ముందున్న వాళ్లను స్కోర్ అడిగి తెలుసుకోవడమే మిగిలేది. కళ్లు కాయలు కాసేలా నిలబడి చూసినా కాలు నొప్పులు తెలిసేవి కావు. మధ్య మధ్యలో మరొకరికి అవకాశం. సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఇంటి వాళ్లు జాలి తలచి కిటికీ తలుపులు తెరిస్తే.. మాకు పండుగే. ఒకవేళ ఏ చిరాకుతోనో వాళ్లు కిటికీ మూసేశారో.. గుండె బద్దలైనంత పనయ్యేది. లోపల వినిపించే కామెంట్రీని బట్టి స్కోర్ ఊహించుకుంటూ ఆ కిటికీ బయటే పడిగాపులు కాసేవాళ్లం. వర్షం పడుతున్నా సరే, తడవకుండా ఆ ఆ ప్లేస్లోనేఒదిగిపోయి మ్యాచ్ చూసిన రోజులు నాకింకా గుర్తే.
(ఇదీ చదవండి ‘నైట్ స్టడీస్’ మధుర స్మృతులు)
క్యూ కట్టించిన సీరియల్స్
నిజానికి మా ఊరిలో మొట్టమొదటి టీవీ పండి వారి ఇంట్లో ఉండేది. అది చాలా చిన్న టీవీ. కానీ ‘మహాభారతం’ సీరియల్ వస్తుందంటే చాలు.. ఊళ్లో పిల్లలందరం అక్కడికి చేరేవాళ్లం. వారి ఇంటి అరుగు మొత్తం మాతోనే నిండిపోయేది. కొంచెం పెద్దయిన తర్వాత మిగిలిన వారు కూడా మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చినట్లు ఓ జ్ఞాపకం. కాలక్రమంలో ఊళ్లో టీవీల సంఖ్య మెల్లగా పెరిగింది. దుద్ది సన్యాసిరావు మాస్టారి ఇల్లు, రౌళో గిరి, కదంబాల వారి ఇల్లు.. ఇలా ఎక్కడ టీవీ ఉంటే అక్కడ వాలిపోయేవాళ్లం. కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ఈటీవీలో వచ్చే ‘అన్వేషణ’, జెమినీలో వచ్చే ‘తులసీదళం’ లాంటి సీరియల్స్ మొదలవుతున్నాయంటే చాలు, క్యూ కట్టేవాళ్లం. టీవీలో వచ్చే దృశ్యాలకు భయపడుతూ, ఉలిక్కిపడుతూ చూసిన ఆ వినోదం ఇప్పుడు ఏ ఓటీటీలోనూ దొరకదు. అప్పుడప్పుడు సిగ్నల్ అందక టీవీలో చుక్కలు కనిపిస్తే, పైన మేడ మీద ఎవరో ఒకరు యాంటెన్నా పట్టుకుని దిశలు మార్చడం, కింద నుంచి మేం వచ్చింది.. వచ్చింది! అని కేకలు వేయడం ఒక పెద్ద ప్రహసనం.
మా సొంత ఇంటి టీవీ ముచ్చట
మా వీధిలో లోట్ల కూర్మనాయకులు గారు మొదటిసారి టీవీ కొనడంతో మా వీధికి పండగొచ్చింది. ఆ తర్వాత గార, రెయ్యి వారి ఇళ్లలో కూడా టీవీ చూసిన అనుభవాలు ఎన్నో. ఇక మా సొంత టీవీ ముచ్చటకు వస్తే.. 2009లో మేం కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు, బల్లెడ శంకరరావు గారు ప్రేమతో బహూకరించిన పాత టీవీతో మా ఇంట్లో తొలిసారి బొమ్మ పడింది. కొన్నాళ్ల పాటు దాన్ని వాడిన తర్వాత, 2016లో నా సొంత సంపాదనతో ఎల్జీ టీవీ కొన్నాను. ఆ తర్వాత కాలానికి తగ్గట్లుగా మరో టీవీ.. ఇదీ నా టీవీ ప్రయాణం!
మారుతున్న కాలం.. మారని జ్ఞాపకం
ఒకప్పుడు మ్యాచ్ చూడాలంటే కిటికీల ముందు గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఎక్కడున్నా అరచేతిలో ఉన్న సెల్ఫోన్లో హెచ్డీ క్వాలిటీలో క్రికెట్ చూసే స్థాయికి ఎదిగాం. టెక్నాలజీ ప్రపంచాన్ని కుదించేసింది. కానీ, ఇప్పుడు ఫోన్లో చూస్తున్నప్పుడు ఆనాటి కిటికీ నుంచి చూస్తున్న ‘కిక్’ అయితే లేదు.
ఈ మధ్య ఊరెళ్లినప్పుడు ఆ కృష్ణారావు గారి ఇంటి వైపు చూశాను. ఆ ఇంట్లో ఇప్పుడు మనుషులెవరూ నివసించడం లేదు, అదొక కిరాణా షాపుగా మారిపోయింది. కానీ నా కళ్లకు మాత్రం ఆ ఇల్లు, ఆ కిటికీ, దాని వెనుక ఉన్న అస్పష్టమైన టీవీ తెర, పక్కన స్నేహితుడు, మా క్రికెట్ పిచ్చి... అన్నీ సినిమా రీల్ లా కళ్లముందు కదలాడాయి. రోజులు మారాయి, సౌకర్యాలు పెరిగాయి కానీ, ఆ తపనలో ఉన్న ఆనందం ఈ ఆధునిక కాలంలో వెతుక్కున్నా దొరకదు. ఆ కిటికీ మాకు కేవలం టీవీని చూపించలేదు, జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలను కూడా ఇచ్చింది.
-గొరకల పూర్ణచందర్, 9705094441
మీ మధురస్మృతులు మా బాల్యాన్ని గుర్తు చేశాయి. అప్పట్లో మాకు టీవీ లేదు.. పక్కనే ఉన్న మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేవాళ్ళం. గురువారం వచ్చే చిత్రలహరి, .. ఆదివారం తెలుగు సినిమా కోసం వారం అంతా ఎదురు చూసేవాళ్ళం . 2,3 నెలలకు ఒకసారి నైట్ అంతా కూర్చుని VCD లో సినిమాలు చూసిన ఙ్ఞాపకాలు మర్చిపోలేం.
రిప్లయితొలగించండిమళ్ళీ ఆ రోజులను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.