వావ్ గంగవరం బీచ్
సుందరమైన విశాఖలోని అందమైన బీచ్‌ల్లో ఒకటి గంగవరం బీచ్. మిగతా బీచ్ల్లా కాకుండా ఈ బీచ్ ఉత్కంఠభరిత తీరప్రాంతం కలిగి ఉంటుంది. స్టీల్‌ప్లాంట్, గంగవరం పోర్టుకు సమీపంలోని ఈ బీచ్ మనకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించు కునేందుకు గొప్ప అవకాశాలను కల్పిస్తుంది. ఒత్తిడితో కూడిన జీవితానికి దూరంగా.. సంతోషకమైన అనుభవాలను ఆస్వాదించడానికి.. ప్రతిక్షణం.. ప్రతి అడుగూ ఓ కొత్త లోకంలో విహరించే అనుభూతిని అందిస్తుంది.
ఏకాంత వాతావరణం ఇష్టపడేవారికి ఈ బీచ్ బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మీరు సూర్యుడి నీడలో సేదతీరవచ్చు. మృదువైన ఇసుకతో ఆడుకోవచ్చు. అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. కొండలు ఎక్కి సాహసయాత్ర చేయవచ్చు. అందుకేనేమో ఇక్కడి ప్రకృతి అందం సినీ దర్శక, నిర్మాతలను కట్టిపడేసింది. ఇక్కడ అభిలాష, గోరింటాకు, ఆరాధన, మరోచరిత్ర, సుస్వాగతం, శివమణి, బాలరామాయణం లాంటి వందలాది సినిమాలు షూటింగ్‌లు జరుపుకోవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.
ఒకప్పుడు ఇక్కడ గంగవరం గ్రామం ఉండేది. స్టీల్‌ప్లాంట్, గంగవరం పోర్టు రావడంతో ఇక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. ఆ ఆనవాళ్లు మాత్రం ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. సముద్రతీరంలో కొండపై సుమారు 20 అడుగల ఎత్తులో మాధవస్వామి ఆలయం ఉంది. ఇక్కడ పూజలు చేస్తే సంపదలతో పాటు కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇందుకో పురాణగాథ కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. కృష్ణావతారం ముగిసిన అనంతరం వైకుంఠానికి చేరిన విష్ణుమూర్తి సత్యభామ కోరికపై తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడట.. వైకుంఠంలో లక్ష్మీదేవికి విష్ణుమూర్తి భూలోకంలో ఉన్నారని నారదుడు తెలియజేయడంతో... ఆమె కూడా భూలోకానికి వచ్చిందట. ఆమె రాకను గమనించిన విష్ణుమూర్తి సత్యభామను శిలగా మార్చివేశాడని.. మాధవుడు కూడా లక్ష్మీదేవితో కలసి ఇక్కడే కొండపై కొలువు తీరాడని చెబుతారు. తన పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన సత్యభామకు మాఘ మాసంలో తొలిపూజలు నీకే దక్కుతాయని, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతావని వరమిచ్చినట్లు కథ ప్రచారంలో ఉంది.
మాధవస్వామి ఆలయానికి సమీపంలోనే సత్యభామ రాయి ఉంది. సంకల్ప బలం ఉంటే కొండలనైనా కష్టనష్టాలకోర్చి అధిరోహిస్తారంటారు. అది నిజమే అని నిరూపిస్తున్నారు సత్యభామ రాయి వద్దకు చేరుకునే భక్తులు. సంతానం కోరుకునే దంపతులతో పాటు సందర్శకులతో ఏటా కనుమరోజు ఈ ప్రాంతం కళకళలాడుతుంది. మాధవస్వామి దర్శనం అనంతరం ఆ కొండ దిగి.. అక్కడి నుంచి మరో 30 అడుగుల ఎత్తులో ఉన్న కొండపైకి ఎక్కి పై భాగంలోని శిల వద్దకు చేరుకుంటారు. సత్యభామకు పూజలు చేసి మహిళలు పైటకొంగులో చిన్న రాయి ఉంచి ఊయల మాదిరిగా ఊపుతూ మొక్కుకుంటారు. సత్యభామ అనుగ్రహంతో వారికి ఆడపిల్ల పుడితే సత్య, మహాలక్ష్మి, మాధవి అని, మగపిల్లవాడు పుడితే మాధవ్ అనే పేర్లు పెడుతుంటామని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
విశాఖపట్నం నుంచి సుమారు 26 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. పెదగంట్యాడ జంక్షన్ స్టీల్‌ప్లాంట్ బీసీ గేటు పక్క నుంచి ఈ బీచ్‌కు చేరుకోవచ్చు. అక్కడ ఏమి అందుబాటులో ఉండవు. ముందుగానే అన్ని సమకూర్చుకోవాలి. పండగలు, వారంతపు రోజుల్లో తప్పితే మిగతా రోజుల్లో ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. రవాణా వ్యవస్థ కూడా ఉండదు.
