అతని ఇల్లే పురాతన మ్యూజియం
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన హాబీ. కొందరికి పాత వస్తువుల సేకరణపై ఆసక్తి ఉంటుంది. మరికొందరు నాణేలు సేకరిస్తారు. స్టాంపులు సేకరించే వారు ఇంకొందరు. ఇవన్నీ కలగలిస్తే.. కోరుపోలు గంగధారరావు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.
ఆయన ఇల్లు.. అలనాటి అద్భుత కళాఖండాల భాండాగారం. మనం చూడని.. మనకు తెలియని అనేక వస్తువులు ఇక్కడ దర్శనమిస్తాయి. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ కలిగిన గంగధారరావు.. మానవ జీవన విధానంలో భాగమైన పురాతన వస్తువులను సేకరించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు.
పూర్వపు కాలంలో వాడిన పనిముట్లు, సామగ్రి, ఆహారపు కోసం వాడిన పాత్రలను భవిష్యత్ తరాలకు చూపించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పరవాడకు చెందిన గంగాధరరావు బర్నికం శివారు బపాడుపాలెంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 22 ఏళ్ల కిందట పురాతన వస్తువుల సేకరణపై ఆయనకు ఏర్పడిన ఆసక్తి తర్వాత.. యజ్ఞంలా మారింది. ఇప్పుడు ఆయన ఇల్లు చూస్తే.. ఓ మ్యూజియంలా దర్శనమిస్తుంది.
ఆ రోజుల్లో వాడిన కంచు గ్లాసులు, కంచు గిన్నెలు, వంట పాత్రలు, గిన్నెలు, గంగ చెంబులు, గోకర్ణాలు, గ్రామఫోన్ల రికార్డులు, ఇత్తడి కిరోసిన్ దీపాలు, బుడ్డీలు, లాంతర్లు, పాత రేడియోలు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కర్ర గరిటెలు, డోకులు, మజ్జిగ కల్లాలు దర్శనమిస్తాయి. వంట పాత్రలు, అడ్డెడు గిన్నెలు, చోల, మానిక తదితర వస్తువులు, 100 నుంచి 300 ఏళ్ల కిత్రం నాటి వస్తువులు ఈయన సేకరించిన వాటిలో ఉన్నాయి.
గ్రామ ఫోన్ రికార్డులు
అలనాటి మధుర గీతాలు గ్రామ ఫోన్ రికార్డుల రూపంలో ఉండేవి. 1932 రామ పాదుక పట్టాభిషేకం సినిమా రికార్డు మొదలు 1980 వరకు విడుదలైన సినిమాల పాటల రికార్డులు ఇక్కడ దర్శనమిస్తున్నాయి.
కీ గ్రామఫోన్, ఎలక్ట్రికల్ గ్రామ ఫోన్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. వీటితో పాటు మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1956లో అమెరికా వెళ్లినపుడు అక్కడ చేసిన ప్రసంగం, పేపర్ రికార్డులు, ప్లాస్టిక్ కవర్ రికార్డులు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. వెయ్యికి పైగా టేపు క్యాసెట్లు, 1960 నాటి పెద్ద పెద్ద రేడియోలు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, అప్పటి టెలీఫోన్లు, టైపు రైటర్లు, కత్తులు, కొరడాలు.. ఇలా ఎన్నో ఆపాత మధురాలు ఇక్కడ మనకు తారసపడతాయి.
చేతి రాతతో రాసిన ప్రపంచంలో ప్రత్యేకత కలిగిన భారత రాజ్యాంగం ఇక్కడ దర్శనమిస్తుంది. భారత రాజ్యాంగంలో 284 మంది మేధావులు సంతకాలు చేశారు. వీరిలో భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్, పట్టాభి సీతారామయ్య వంటి ఎందరో మేధావులు ఉన్నారు. భారత రాజ్యాంగం అసలు కాపీని పార్లమెంట్ లైబ్రరీలో పాడవకుండా ప్రత్యేక జాగ్రత్తలతో భద్రపరిచారు. భారత రాజ్యాంగం నకళ్లను అప్పట్లో భారత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఓ కాపీని గంగధారరావు సేకరించారు.
ఒకప్పుడు వంశపారంపర్యంగా వస్తువులను ఇచ్చేవారు. ప్రస్తుతం పాత తరం వస్తువులను చూడాలంటే మ్యూజియంలకు వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి మ్యూజియం మన గంగధారరావు మాస్టర్ ఇల్లు. అంతలా ఆయన వస్తువులను సేకరించి భద్రపరిచారు. భవిష్యత్ విశాఖలో ఈ వస్తువులతో సొంతంగా మ్యూజియం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.
