ఉద్దానం సంస్కృతీ వైభవం
- మూడు రోజుల వైష్ణవ పర్వదినం
- వందల ఏళ్ల ఆచారం
- ఉద్దానం ప్రాంతంలో దశావతారాల ప్రత్యేక పూజ
![]() |
| జగతిలో శమళ్ల వారి దేవుడి సంబరం(ఫైల్) |
- కోలలు (దివిటీలు): వీటిని వెలిగించడంలో ప్రత్యేక ఆచారం ఉంది.
- నామం పళ్లు
- అవతారాలు
- తాళాలు: రామావతారం, కృష్ణావతారం, నారసింహావతారాలకు సంబంధించినవి.
మూడు రోజుల వైభవ ఘట్టాలు
ఈ సంబరాలు సాధారణంగా శుక్రవారం రాత్రి ప్రారంభమై, ఆదివారం మధ్యాహ్నంతో పూర్తవుతాయి. మూడు రోజుల పాటు ప్రత్యేక బృందం (దాసులు) ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ బృంద నాయకుడిని మూలదాసుడు అని పిలుస్తారు. 'దేవుడికీ దించండీ నారాయణా...' వంటి పాటలను నిరంతరం ఆలపిస్తారు.
శుక్రవారం - దేవుడిని దించడం
- సాయంత్రం: దేవుడిని అవతారంగా భావించే చిత్రం ఉన్న వస్త్రం, తాళాలు, ఇతర వస్తువులను మేదర పెట్టెలో ఉంచి, ఇంటిలోని ఎత్తయిన ప్రదేశంలో ఉంచుతారు. దీనిని కిందకు దించడాన్నే 'దేవుడిని దించడం' అంటారు.
- ముందుగా వినాయకుడికి, ఇష్టదేవతలు, గ్రామదేవతలకు పూజలు చేస్తారు.
- పాలు కొలవడం: ధాన్యం లేదా బియ్యంతో ఈ ప్రక్రియ చేస్తారు.
- నైవేద్యం: బాలభోగం సమర్పించిన తర్వాత, కాలభైరవుడిని మేల్కొలుపు
శనివారం - సముద్ర స్నానం, ఊరేగింపు
- ఉదయం: మేల్కొలుపు, బాలభోగం నిర్వహిస్తారు. ముందు రోజు కొలిచిన పాల బియ్యాన్ని మళ్లీ కొలుస్తారు. కొలిచిన బియ్యం లెక్క తగ్గకుండా ఉండడం భక్తుల విశ్వాసం.
- మధ్యాహ్నం: స్థోమతను బట్టి అన్న సమారాధన చేస్తారు.
- సాయంత్రం: ఈ రోజు ఉపవాసం ఉన్న పేరంటాళ్లు, భక్తులు సముద్రానికి వెళ్లి పాత పెట్టె, సామగ్రిని నిమజ్జనం చేసి స్నానాలు ఆచరిస్తారు. కొత్త వస్తువులను సాగర జలాలతో అభిషేకించి తిరిగి ఊరిలోకి వస్తారు.
- ఊరేగింపు: గ్రామంలోని ఏదైనా ఆలయంలో జేగంట మోగిన వెంటనే ఊరేగింపు మొదలవుతుంది. స్వామివారి వస్తువులు పళ్లెంలో, అవతారాలు, కోలలు పట్టుకొని ఊరేగిస్తారు. ఆడపడుచులు నివ్వాళి పాటతో స్వామివారిని ఇంటిలోకి ఆహ్వానించి, దిష్టి తీస్తారు.
- ( క్లిక్ చేయండి. పూర్తి దేవుడి సంబరం వీడియో చూడవచ్చు దేవుడు సంబరం )
ప్రత్యేక నైవేద్య ఘట్టాలు
- తులసమ్మ భోగం: తులసి కోట వద్ద అట్లు, పాల కాయలు, అన్న ప్రసాదం, కొత్త వస్త్రాలు పెడతారు.
- వేంకటేశ్వరుని భోగం: కలశాలలోని నీటిని వేంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భావించి, అన్న ప్రసాదం, అట్లు, పాలకాయలు, వస్త్రాలు నైవేద్యంగా సమర్పిస్తారు.
- బైరోడు స్వామికి భోగం: కొలిచిన పాలు (బియ్యం)తో తయారు చేసిన పాయసాన్ని కాలభైరవుడికి సమర్పిస్తారు. ఈ ప్రసాదం తయారుచేసేవారు నోటికి వస్త్రాన్ని కట్టుకోవడం ఇక్కడి ఆచారం.
ఆసక్తికర ఘట్టం: ప్రసాదం దొంగిలించడం
బైరోడు స్వామి ప్రసాదాన్ని మట్టి కుండలో ఉంచి, పందిరి మధ్యలో ముగ్గుపై ఉంచుతారు. దాసులు, భక్తులు కుండ చుట్టూ తిరుగుతూ పాటలు పాడే సమయంలో, సంబరం నిర్వహించేవారికి వరుసైన మేనల్లుళ్లు, మేనమామలు, బావలు ఆ కుండను దొంగిలించడం ఒక ఆచారం. దొంగిలించిన వ్యక్తి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు. ఈ ఘట్టం అత్యంత ఉత్సాహంగా, ఆసక్తికరంగా సాగుతుంది.
కోలలు పలికించడం
నేతితో లేదా ఆముదంతో నింపిన కోలలను వెలిగించి, మండుతున్నప్పుడు తలకిందులుగా చేస్తారు. దాసులు పూజించే అవతారం పేరు పెట్టి పిలిచినప్పుడు కోలల నుంచి నిప్పులు రాలుతాయి. దీనిని భక్తులు 'దేవుడు పలకడం' లేదా 'పూవులు' రాలడం అని విశ్వసిస్తారు.
ఆదివారం - కొండపైకి ఎక్కించడం
- ఉదయం: స్వామివారికి మేల్కొలిపి, పూజలు చేస్తారు.
- సమాప్తి: మూడు రోజులు పూజలకు ఉపయోగించిన సామగ్రి, తాళాలను కొత్త మేదర బుట్టలో పెట్టి మూతవేస్తారు. భక్తుల కానుకలను కూడా ఇందులో వేస్తారు.
- కుటుంబ పెద్ద ఆ బుట్టను తలపై పెట్టుకుని, ఇంటి లోపల ఎత్తుగా ఉన్న ప్రదేశంలో భద్రంగా మళ్లీ అమరుస్తారు. దీనినే 'దేవుడిని కొండపైకి ఎక్కించడం' అంటారు. దీంతో సంబరాలు పూర్తయినట్టు భావిస్తారు.
- ఈ సందర్భంలో అరటి గెలల నుంచి పండ్లను విడదీసి పైనుంచి కిందకు విసురుతారు. ఎవరికి ఎక్కువ పండ్లు దొరికితే, వారిని దేవుడు కరుణించినట్టుగా భావిస్తారు.
'దేవుడిని దించడం' మొదలుకొని, 'కొండపైకి ఎక్కించే' వరకు ప్రతి ఘట్టం ఉత్సాహంగా, ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే ఎవరి ఇళ్లలో సంబరం జరిగినా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి ఈ వైభవాన్ని తిలకిస్తారు.


