![]() |
2023 హరిద్ర గణపతి రూపం |
- పర్యావరణహితమే శ్రీ బాలగణపతి ఉద్దానం యూత్ క్లబ్ లక్ష్యం
- ఏటా కొత్త కాన్సెప్ట్.. స్థానిక ఉత్పత్తులతోనే విగ్రహాల రూపకల్పన
వినాయక చవితి వస్తుందంటే.. యువతకు ఒకటే హడావుడి. చవితి పందిరి ఎలా వేయాలి? ఎటువంటి గణపయ్యను ప్రతిష్టించాలి? ఏఏ సాంస్కృతిక ఏర్పాటు చేయాలి.? అనే ఆలోచనలు, ఏర్పాట్లతో ఎవరికి వారు వైవిధ్యంగా సిద్ధమవుతుంటారు. అయితే శ్రీ బాలగణపతి ఉద్దానం యూత్ క్లబ్.. వినాయక చవితి ద్వారా సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలి.? అనే కోణంలో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్టిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. హానికారక రసాయనాలు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటివి ఉపయోగించకుండా స్థానికంగా లభించే ఉత్పత్తులతోనే రూపొందిస్తున్న వినాయకుడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతే కాదండోయ్.. పర్యావరణహిత విఘ్నేశ్వరుడు క్లబ్‌కు బోలెడన్ని ప్రశంసలు.. అవార్డులు కూడా తీసుకొచ్చాడు. క్లబ్ ముఖ్య సభ్యుడు, శిల్ప కళారత్న భైరి తిరుపతి చేతిలో ఏటేటా రూపుదిద్దుకుంటున్న గణనాథుడు ఉద్దాన ప్రాంతానికే ప్రత్యేకం. అనట్టు 2023లో హరిద్ర గణపతి రూపంలో గణేశుడి ఆవిష్కృతమై భక్తులకు దర్శనమిస్తున్నాడు.
మనం అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండగ వినాయక చవితి. గణేష్ చతుర్థిని సమష్టికి చిహ్నంగా చెప్తారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా వాడవాడలా అందరూ కలిసి వినాయక మండపాలు ఏర్పాటు చేసి అత్యంత భక్తి, శ్రద్ధలతో గణేశుడిని పూజిస్తారు. అలా 18 సంవత్సరాల కిందట శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన యువకులు కూడా శ్రీ బాలగణపతి త్రిరాత్రి మహోత్సవాల పేరిట మండపం ఏర్పాటు చేసి.. వినాయక చవితి పూజలను ప్రారంభించారు. అలా 2012 వరకు మార్కెట్లో లభించే వినాయకుడి ప్రతిమలనే కొనుగోలు చేసి పూజించేవారు. అయితే 2012లో గొప్ప మార్పుకు శ్రీకారం జరిగింది.
‘అప్పటి వరకు పక్క రాష్ట్రం ఒడిశా నుంచి విగ్రహాలు కొనుగోలు చేసి తీసుకొచ్చేవాళ్లం. ఉత్సవాలు పూర్తయ్యాక. వాటిని సముద్రంలో నిమజ్జనం చేసే వాళ్లం. దీని వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని చింతించాం. అప్పుడు మట్టి విగ్రహాలను పూజించాలనే నినాదం ఊపందుకుంది. మరేం చేద్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు మాకు శిల్పి భైరి తిరుపతి ఆశాకిరణంలా కనిపించారు. గణపతి విగ్రహాన్ని ఎలా రూపొందించాలని చర్చలు జరుగుతున్న సమయంలో ఆయన పాల్గొన్నారు. ఎవరూ చేయనంత కొత్త దనంతో.. భక్తి భావం.. ప్రకృతి మీద ప్రేమతో చేద్దాం అని అన్నాడతను.’అని చెప్పారు అప్పటి క్లబ్ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యుడు దుద్ది సతీష్ కుమార్..
కొంచెం ఫ్లాష్బ్లాక్లోకి వెళితే.. పేదరికంలో పుట్టిన తిరుపతికి కళలంటే చాలా ఇష్టం. పదో తరగతి పూర్తవ్వగానే 2000లో ఆయన ఈ రంగంలోకి అడుగు పెట్టారు. కడుపు నింపుకోవడంతో పాటు మనసారా పనిచేసేలా ప్రవృత్తినే వృత్తిగా ఎంచుకున్నారు. విశాఖపట్నంలో ఈ కళలో పూర్తి మెళకువలు సాధించిన తర్వాత సొంత గ్రామానికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో శ్రీ బాలగణపతి యూత్ క్లబ్ ఆవిర్భావం.. తిరుపతిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. 2012లో గణేష్ ఉత్సవాలను పర్యవరణానికి మేలు చేకూర్చేలా నిర్వహించాలనే సంకల్పంతో కొత్త ఆలోచనలకు బీజం పడింది. స్థానికంగా ఉన్న వనరులనే ఉపయోగించి విగ్రహాలు రూపొందించడం ఆయన ప్రత్యేకత. అందుకే మొదటి ఏడాదిలోనే ఆయన ప్రతిభ రాష్ట్రమంతా వ్యాపించింది. వేలాది మంది భక్తులు గణేశుడి విగ్రహాన్ని చూసేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో క్లబ్‌కు, ఆయనకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు దక్కాయి.
![]() |
2012- నారికేళ గణపతి |
(రెండు వేల కొబ్బరి కాయలను వినియోగించి 2012లో నారికేళ గణపతిని రూపొందించారు. విగ్రహం చుట్టూ కొబ్బరి ఉత్పత్తులను వాడారు. )
![]() |
| 2013 - నలుగు గణపతి |
(గణేశుడి జన్మలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగు పిండితో తయారైన బొమ్మకు ఆదిశక్తి పార్వతీ దేవి ప్రాణప్రతిష్ట చేస్తే.. ఏనుగు తలను అతికించి ఆది దేవుడు పరమేశ్వరుడు పునఃప్రాణ ప్రతిష్ట చేశారు. నలుగుతోనే 2013లో నలుగు గణపతిని రూపొందించారు. ఇందుకు 100 కిలోలకు పైగా నలుగును వినియోగించారు. )
![]() |
2014- వరినారు గణపతి |
(2014లో వీటికి భిన్నంగా ఎక్కడా.. ఎవరూ తయారు చేయని విధంగా వరినారుతో వినాయకుడిని తయారు చేశారు. దీంతో ఉద్దాన ప్రాంతంలో ఈ విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది. తిరుపతి శ్రమ, ప్రయత్నం వృథా కాలేదు. ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఈ విగ్రహానికి స్థానం లభించింది.)
![]() |
| 2015 వనమూలికల గణపతి |
(2015లో మరింత వినూత్నంగా ఔషధ మొక్కలు, వనమూలికలు సేకరించి వాటితో ఆయుర్ గణపతిని తయారు చేశారు. భారతీయ వైద్యానికి మూలస్తంభం వంటి ఆయుర్వేదం ప్రాధాన్యం అందిరికీ తెలియజేసేలా ప్రచారం చేశారు. ఈ ప్రయత్నానికి బోలెడన్ని ప్రశంసలు దక్కాయి. )
![]() |
| 2016- పామాయిల్ గణపతి |
(2016లో కొత్తదనం ఉండాలని తపిస్తూ.. 5 వేల పామాయిల్ కాయలను వినియోగించి పామాయిల్ గణేశుడి విగ్రహాన్ని తయారు చేసి.. శభాష్ అనిపించుకున్నారు. ఇదీ అందర్నీ ఆకట్టుకుంది. )
(2017లో రూపొందించిన గోధుమ నారు గణపతి విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది. ముందుగా మట్టితో విగ్రహాన్ని రూపొందించి దానిపై గోధుములను వేశారు. అవి మొలకెత్తడానికి రోజూ నీటితో తడిపి.. విగ్రహం పైనే మొలిచేలా చేశారు. ఇందుకు 40 కిలోల గోధుమలను వినియోగించారు. )
![]() |
2017- గోధుమ నారు గణపతి |
![]() |
2018- నారికేళ పుష్ప గణపతి |
(కొబ్బరి కాయ నుంచి గణపతి ప్రత్యక్షమైనట్లు రూపొందించిన నారికేళ పుష్ప గణపతి విగ్రహం కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఇందుకు కొబ్బరి పువ్వులను వాడారు. )
![]() |
2019- లేఖినీ రూప గణపతి |
లేఖినీ గణపతి మేకింగ్ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి
(కరోనా కారణంగా 2020లో పల్లకిలో గణపతిని రూపొందించి పూజలు జరిపించారు. )
2021- నల జీడి పిక్కలు
(2021 నల జీడి పిక్కలతో వినాకుడిని రూపొందించారు. ఈ వినాయకుడు కూడా అద్భుత రీతిలో రూపొందుకుంది. )
2023 : హరిద్ర గణపతి
2023 పసుపు దుంపతో ఈ ఏడాది రూపొందించిన హరిద్రి గణపతి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘గణపతి 32 విభిన్న రూపాల్లో హరిద్ర గణపతి 21వదిగా పరిగణిస్తారు. పసుపు అపారమైన ఔషధ విలువలతో కూడిన ఓ శుభకరమైన పదార్థం. అందుకే పసుపుతో తయారు చేసిన హరిద్ర గణపతి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూజిస్తే మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు లభిస్తాయని నమ్ముతారు. హరిద్ర గణపతిని ప్రార్థించడం వల్ల కోరిన కోర్కెలు నేరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ శ్రమంతా గ్రామంలో సాంస్కృతిక వాతావరణాన్ని కొనసాగించడానికే.. ఈ ఉత్సవాలు కేవలం విగ్రహాలకు పరిమితం చేయడం లేదు. మా క్లబ్ ద్వారా యువతకు ఎప్పటికప్పుడు సృజనాత్మక పోటీలు నిర్వహిస్తున్నాం. వారిలో దాగి ఉన్న ప్రతిభ వెలికితీయడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం’ అని చెప్పారు ప్రస్తుత అధ్యక్షుడు లొట్ల దీనబంధు.














