విశాఖ విమానాశ్రయానికి వీడ్కోలు
ఆగస్టు 16, 2026... విశాఖ నగర చరిత్రలో ఇదొక భావోద్వేగభరితమైన రోజు. దశాబ్దాల పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు సేవలందించిన విశాఖపట్నం విమానాశ్రయం పౌర విమానయాన సేవలకు నేటి అర్ధరాత్రితో సెలవు తీసుకోనుంది. రేపటి (ఆగస్టు 17) నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు ఎగరనున్నాయి. సముద్రం మీదుగా విమానం గాలిలోకి ఎగురుతుంటే విండో సీట్లో కూర్చుని చూసే అద్భుత దృశ్యాలు, మిరుమిట్లు గొలిపే పోర్టు, కంటెయినర్ టెర్మినల్... ఇవన్నీ ఇకపై ప్రయాణికులకు కేవలం గత స్మృతులే!
నిజానికి విశాఖపట్నం విమానాశ్రయానికి ఘనమైన చరిత్ర ఉంది. 1941లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయుల రాయల్ ఎయిర్‌ఫోర్స్ కోసం చిన్న రన్‌వేగా మొదలైన ఈ విమానాశ్రయం, ఆ తర్వాత 1962లో పౌర విమానాలకు అందుబాటులోకి వచ్చింది. మొదట్లో రోజుకు కేవలం ఒక విమానంతో మొదలైన ప్రయాణం, ఒక దశలో రోజుకు 40 విమానాలు, ఎన్నో అంతర్జాతీయ సర్వీసులను అందించే స్థాయికి చేరింది. 2007లో పెద్ద రన్‌వే, 2008లో ప్రత్యేక టెర్మినల్‌తో ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు తన సివిల్ కార్యకలాపాలను పూర్తిగా ముగించుకుని, తూర్పు నౌకాదళం (నేవీ) రక్షణ అవసరాల కోసం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వెళ్లనుంది.
ఎందరికో ఈ ఎయిర్‌పోర్టుతో ఎన్నో రకాల అనుబంధాలు ఉండొచ్చు... కానీ నాకు మాత్రం విశాఖ విమానాశ్రయంతో ఉన్న అనుబంధం నా జీవితకాలపు మధురానుభూతి. నేను నా జీవితంలో ఇప్పటివరకు విమానం ఎక్కింది ఒక్కసారే! అంతకుముందు మా మామయ్య కువైట్ నుంచి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఒకటీ రెండు సార్లు, నా మిత్రుడు మాల్దీవులు వెళ్లినప్పుడు సెండాఫ్ ఇవ్వడానికి మాత్రమే ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. కానీ, విమానాశ్రయం లోపలికి వెళ్లి తొలిసారి ప్రయాణించింది మాత్రం ఆ ఒక్కసారే. దానికి కారణం నా భార్య డీఎస్సీ (DSC) కౌన్సెలింగ్!
సరిగ్గా సంవత్సరం క్రితం... తేదీ ఆగస్టు 28, 2025.
నా భార్య కర్నూలు జిల్లాను ఎంపిక చేసుకుని డీఎస్సీ రాసింది. మంచి మార్కులే వచ్చాయి కానీ కర్నూలులో ఎక్కువ పోస్టులు ఉండటంతో పాటు హెవీ కాంపిటీషన్. "ఉద్యోగం వస్తుందా? రాదా?" అన్న టెన్షన్. ఒక్కొక్కరిదీ ఒక్కో విశ్లేషణ. శ్రీకాకుళంలో రాసి ఉంటే కచ్చితంగా వచ్చేదని కొందరు, ఈ మార్కులకు రావడం కష్టమని మరికొందరు. మా గురువు రాజబాబు గారు మాత్రం "ఖచ్చితంగా వస్తుంది" అని భరోసా ఇస్తున్నప్పటికీ, మనసులో ఎక్కడో తీవ్రమైన ఒత్తిడి. మెయిల్‌కు లెటర్ వస్తుందా, ఫోన్‌కు మెసేజ్ వస్తుందా అంటూ క్షణం క్షణం ఉత్కంఠగా చెకింగ్లు.
ఆ రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో ఆ ఉత్కంఠకు తెరపడింది. సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది! రేపు ఉదయం 9 గంటలకు కర్నూలులో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నది ఆ మెసేజ్ సారాంశం. అయితే సమయానికి ఎలా వెళ్లాలి అని ఒకటే ఆందోళన. ఎందుకంటే అప్పుడు మేము వైజాగ్‌లో ఉన్నాం. వైజాగ్ నుంచి బస్సులో కర్నూలు వెళ్లాలంటే దాదాపు 17 నుంచి 20 గంటల ప్రయాణం. నేరుగా రైలు సౌకర్యం లేదు. పోనీ విజయవాడ నుంచి నంద్యాల వచ్చి, అక్కడి నుంచి కర్నూలు వెళ్దామన్నా ఆ సమయానికి రైలు లేదు. ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకుందామన్నా సమయానికి చేరుకునే పరిస్థితి లేదు. ఏం చేయాలో పాలుపోని ఆ గందరగోళంలో మా కజిన్ శ్రీను ఒక సలహా ఇచ్చాడు. "విమానంలో హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుంచి బస్సులో కర్నూలు వెళ్లొచ్చు కదా!" అన్నాడు.
అప్పటివరకు మేమెప్పుడూ విమానం ఎక్కలేదు. కానీ వేరే ఆప్షన్ లేదు. వెంటనే ఇండిగో ఫ్లైట్‌కు రెండు టికెట్లు బుక్ చేశాం. మా ఇద్దరు చిన్న పిల్లలను మా అన్నయ్య కూతురికి అప్పగించి ఆదరాబాదరాగా బయలుదేరాము. మరో కజిన్ స్వర్ణ్, అతని భార్య విమాన ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నో సలహాలు ఇచ్చారు. అలా ఆ రోజు రాత్రి మొదటిసారి విశాఖ విమానాశ్రయం లోపలికి అడుగుపెట్టాము.
రాత్రి 10.40 గంటలకు తొలిసారి ఇండిగో విమానం ఎక్కాము. ఆ ప్రయాణం... జీవితంలో స్థిరపడే ఒక గొప్ప ఉద్యోగ కౌన్సెలింగ్ కోసం వేసిన తొలి అడుగు. దాదాపు రాత్రి 11.30 గంటల సమయానికి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగాము. అప్పటికే మాకోసం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న స్వర్ణ, తన కారులో మమ్మల్ని సిటీలోకి తీసుకొచ్చి బస్సు ఎక్కించాడు. ఆ మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కర్నూలు చేరుకుని, విజయవంతంగా కౌన్సెలింగ్‌కు హాజరయ్యాము.
ఆరోజు.. ఆ సమయానికి విమాన ప్రయాణమే తోడు కాకపోయి ఉంటే... మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది. నా భార్య ఉద్యోగ ప్రయాణంలో, మా జీవితంలోని ఆ ముఖ్యమైన మలుపులో విశాఖ విమానాశ్రయం ఒక వారధిలా నిలిచింది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఆ సంఘటన, నాకెప్పటికీ ఎయిర్‌పోర్టుతో ఉన్న తొలి, శాశ్వత అనుబంధం.
ఇప్పుడు, ఈ విమానాశ్రయం పౌర సేవలకు శాశ్వతంగా మూతపడుతోంది అనగానే మనసులో ఏదో తెలియని భారం. రేపటి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు ఎన్నో కొత్త విమానాలకు, కొత్త ప్రయాణికులకు స్వాగతం పలకవచ్చు. కానీ, విశాఖ విమానాశ్రయం మాత్రం నాలాంటి ఎంతోమందికి ఒక చెరగని మధురానుభూతిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. వీడ్కోలు విశాఖ ఎయిర్పోర్ట్!

